శుక్రవారం, అక్టోబర్ 19, 2012

ఎనిమిదో చాప్టరే ఇప్పడు శాసనం !


చాలారోజుల కిందట సినీ నటుడు చిరంజీవి గారింట్లో ఆయన పెద్దకూతురు నిశ్చితార్థం జరిగింది. ఆయన ఆ కార్యక్షికమాన్ని తన ఇంటివరకే పరిమితం చేసుకున్నారు. ఎవరినీ పిలవలేదు. అయినా వాసన పసిగట్టిన మీడియా అక్కడికి వెళ్ళింది. వాళ్ళు లోపలికి అనుమతించలేదు. మొఖం మీదే తలుపువేసినా వదలకుండా కొందరు మీడియా మిత్రులు గోడ దూకి లోపలి వెళ్ళే ప్రయత్నం చేశారు. చిరంజీవి గారి బంధుగణం వారికి ఉచితరీతిన మర్యాదలు చేసి అక్కడి నుంచి పంపించారు. మరుసటి రోజు పత్రికల్లో మీడియా మీద దాడి అంటూ మొదటి పేజీ కథనాలు హంగామా చేశారు. చిరంజీవి మీడియాను అవమానపరిచారని, అది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని గగ్గోలు పెట్టారు. నిజానికి అదొక ప్రైవేటు వ్యవహారం. తన ఇంటి లో విందు భోజనానికి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో నిర్ణయించుకునే స్వేచ్ఛ, హక్కు ఎవరికైనా ఉంటుంది. అయినా పిలవని పేరంటానికి వెళ్లి అల్లరి చేసి, ఆనక పత్రికా స్వేచ్ఛ అంటూ రెచ్చిపోయి రచ్చ చేసిన మీడి యా ఇప్పుడు ప్రధాని పర్యటనలో మీడియాకు జరిగిన అవమానాన్ని ఖండించలేదు సరికదా అది అన్యాయం అన్నట్టు కూడా చూడడం లేదు.

ప్రధాని హైదరాబాద్‌కు వచ్చింది సొంత పనిమీద కాదు. ఆయన ప్రపంచమంతా ఎంతో గంభీరంగా చర్చిస్తోన్న జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు. ఆ సదస్సులో ఆయన ఆతిథ్యం ఇస్తున్న దేశ ప్రధానిగా ఏం మాట్లాడినా ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. ప్రధాని కాబట్టి ఆయన ప్రసంగాన్ని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత పత్రికలకు టీవీ చానళ్ళకు ఉంటుంది. కానీ ఆ ఆవరణలో ప్రవేశించడానికి తెలంగాణ మీడియాకు అనుమతి నిరాకరించా రు. అక్కడికి విధినిర్వహణలో వెళ్ళినవాళ్ళను అవమానించి వెనక్కి పంపించారు. ఇది అన్యాయం, అప్రజాస్వామికం అని అన్నందుకు వాళ్ళను అరెస్టుచేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. అయినా ఆంధ్ర పత్రికలు ఒక్కటికూడా దీనినొక ప్రధానమైన వార్తాంశంగా చూడలేదు. అసలు ఆ వార్తకు ప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. ఒక ప్రాంతానికి చెందిన వారిని, అందునా తమ తోటి పాత్రికేయ సహచరులను ప్రభు త్వం నిషేధిస్తే కనీసం స్పందించకపోవడం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీ య ఆధిపత్యానికి నిదర్శనం. ఒక ప్రాంతానికి చెందిన మీడియాను నిషేధించడం మీడియా హక్కుల సమస్య మాత్రమే కాదు. మొత్తం ఆ ప్రాంత ప్రజలను అవమానించడం. ప్రభుత్వం నిషేధించిన చానెళ్ళు, పత్రికలూ కేవలం తెలంగాణకే పరిమితమైనవి కాదు. అవి ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో రిజిష్టర్ అయి న్ని ప్రాంతాల వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అందరి వార్తలు ప్రచురిస్తున్నాయి. పైగా ప్రధాని వచ్చింది హైదరాబాద్‌కు. అది తెలంగాణ గుండెకాయ. అలాంటిచోట తెలంగాణ వారిని అడ్డుకోవడమంటే ఈ ప్రాంత జర్నలిస్టులను అవమానించడం. 

అలాగే తెలంగాణ యాజమాన్యాలను కట్టడి చేయడం. ఇది సరిగ్గా శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో చాప్టర్‌లో భాగంగా జరిగింది. ఆంధ్రా పత్రికలను, చానళ్లను మేనేజ్ చేసుకోవాలని, డబ్బులిచ్చి, వ్యాపార ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని, తెలంగాణ జర్నలిస్టులను నయానో భయానో లొంగ దీసుకోవాలని, తెలంగాణ మీడియా యాజమాన్యాలను, సంస్థలను కట్టడి చేయాలని ఆ పనికి మాలిన కమిటీలో తలమాసిన వాడెవ డో ఎనిమిదో చాప్టర్ పేరిట సృష్టించిన అదృశ్య అరాచక ఘట్టం ఇది. కోర్టు ముందు అదొక చెల్లని చిత్తూ కాగితం అని చెప్పిన ప్రభుత్వం దాన్ని ఇప్పుడు ఒక రాజపవూతంగా అమలు జరుపుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నది. దాన్ని ఖండించకపోవడమే ఇప్పుడు మన పత్రికాస్వేచ్ఛ పతనానికి పరాకాష్ట.

చాలా సందర్భాల్లో పత్రికలు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా చెప్పుకుంటా యి. భారత రాజ్యాంగం మీడియాకు ఎలాంటి ప్రత్యేక హక్కులు, అధికారా లు ఇవ్వకున్నా తమకు తాము నాలుగో రాజ్యాంగ మూలస్తంభంగా తరచుగా ప్రచారం చేసుకుంటున్నాయి. అది కొంత వరకు నిజమే! గడిచిన అరవయ్యేళ్ళలో పత్రికలు ప్రజాస్వామ్య పరిరక్షణలో క్రియాశీలమైన పాత్రను పోషించాయి. సామాన్యుడికి, బలహీనుడికి అండగా ఉన్నాయి. అన్యాయం జరిగిన సందర్భంలో న్యాయం వైపు నిలబడి నడిచాయి. మన రాష్ట్రంలో కూడా పత్రికలు ప్రజాపక్షం అన్న అభివూపాయం చాలావరకు ఉండింది. నక్సలైట్ల పేరుతో ప్రజలను అణచివేస్తున్నప్పుడు, బూటకపు ఎన్‌కౌంటర్‌లలో నక్సలైట్లను హతమారుస్తున్నప్పుడు, చివరకు కారంచేడు లాంటి మారణకాండ జరిగినప్పుడు కూడా పత్రికలు ప్రజాపక్షాన ఉన్నాయి. కానీ తెలంగాణ విషయంలోనే పత్రికలు కక్షగట్టి వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ ప్రజలను ప్రజా ఉద్యమాలను శత్రు శిబిరంగా చూస్తున్నాయి. ఇది పత్రికా రంగంలో వచ్చిన కొత్త పతనానికి నిదర్శనం. ఆంధ్రవూపదేశ్ రెండుగా విడిపోయి ఉందనడానికి ఈ సంఘటన ఒక తాజా ఉదాహరణ. రాజ్యాంగంలో పేర్కొన్న మూడు వ్యవస్థల్లో ఏ ఒక్క వ్యవస్థ కూడా ఇప్పుడు ఆంధ్రవూపదేశ్‌కు ప్రాతినిధ్యం వహించ డం లేదు. మూడేళ్ళుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ ప్రాంతాల వారీగా విడిపోయాయి. శాసనసభ లోపల వెలుపల అన్ని పార్టీల్లో కూడాఎవరికీ వారే ఉంటున్నారు. కరుడుగట్టిన సీమాంధ్ర ఆధిపత్యంలో ఉన్న పార్ట్టీల్లో కూడా తెలంగాణ వేదికల పేరుతో వేరుకుంపట్లు వెలిశాయి. గడిచిన ఐదారు శాసనసభా సమావేశాల్లో ఏ ఒక్కరోజు కూడా ఏకాభివూపాయంతో సభ నడవలేదు. రాజకీయపక్షాలలో ఈ ప్రాంతీయ విభజన వల్లే ఏడాదిగా స్థానిక సంస్థల కు ఎన్నికలు జరగడం లేదు. ఇప్పుడు ఒక్క శాసనసభ మినహా ఎక్కడా ప్రజావూపాతినిధ్యంలేని రాజ్యాంగ విరుద్ధమైన పాలనే సాగుతున్నది. శాసనసభ కూడా రాజ్యాంగ విరుద్ధంగా, తూ తూ మంత్రంగానే సాగుతోందన్న విమర్శలున్నాయి. ఇక రెండో మూల స్తంభంగా ఉన్న కార్యనిర్వాహక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయి ఉంది. ఉద్యోగులు, అధికారులు ప్రాంతాల వారీగా విడిపోయారు.తెలంగాణ ఉద్యోగులు గెజిటెడ్ అధికారుల నుంచి రోజువారీ వేతన ఉద్యోగుల దాకా స్వతంత్ర సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వానికి తమ సహాయ నిరాకరణను కూడా చవిచూపించారు. సకలజనులతో కలిసి సమ్మెలు చేశారు. మూడో మూలస్తంభామని భావించే న్యాయవ్యవస్థ కూడా నిట్టనిలువునా చీలిపోయి ఉంది. న్యాయవాదులు ప్రాంతీయ భావోద్వేగాలతో ఊగిపోతున్నారు. ఆ ఉద్వేగాల ఉప్పెనలో న్యాయమూర్తులు సైతం రాజీనామాలు చేసే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్క డా కనిపించని నాలుగో స్తంభం కూడా ‘వడపోత’ విధానానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ జర్నలిస్టులను తమతమ సంస్థల నుంచి ఎరివేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పత్రికా స్వేచ్ఛను ఎలా కాపాడాలో ఉపదేశాలు చేసే సంపాదకులు ప్రభుత్వాలు తెలంగాణ మీడియా సంస్థల పట్ల సాగిస్తున్న బహిరంగ నిషేధానికి తమ మూగ సైగలతో సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యానికి ముప్పుగానే భావించాలి.

ప్రధాని హైదరాబాద్‌కు వచ్చి వెళ్ళిన పద్ధతి ఒక దేశాధినేత పర్యటనలా లేదు. ఒక పరాయి దేశంలోకి రహస్యంగా చొరబడిన పొరుగు దేశపు గూడచారిని తలపించింది. ఆయన కనీసం ఈ నేలమీద కాలుకూడా మోపకుండా తన పర్యటన పూర్తిచేసుకున్నారు. మన్మోహన్ ఈ దేశ ప్రధాని. ఈ దేశ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ఆయన రాజకీయ ప్రతినిధి. హైదరాబాద్ అలాగే తెలంగాణ ఆయన పాలిస్తున్న దేశంలో అంతర్భాగం. ఆయన ఎప్పుడైనా స్వేచ్ఛగా ఇక్కడికి రావొచ్చు. కానీ ఆయన వచ్చి వెళ్ళడానికి ఎంచుకున్న తీరు గౌరవవూపదంగా లేదు. ఆ పదవికే అవమానకరంగా అనిపించింది. ఆయన ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాక్షిశయానికి వచ్చారు. ఆయన వెంట ఒక సీమాంధ్ర కాంట్రాక్టర్ ఆ విమానంలో వచ్చారు. ఆయన ఢిల్లీలో బయలుదేరడానికి గంట ముందే హైదరాబాద్ నగరాన్ని పారామిలటరీ దళాలకు అప్పగించి ట్రాఫిక్‌ను పూర్తిగా తమ నియంవూతణలోకి తీసుకున్నారు. ఆయన బేగంపేటలో విమానంలో నుంచి ఆర్మీ సమకూర్చిన హెలీకాప్టర్‌లోకి మారారు. హైదరాబాద్ బేగంపేట విమానాక్షిశయం నుంచి సద స్సు జరిగే ప్రదేశానికి 13 కిలోమీటర్ల దూరం ఉంది. నేరుగా కారులో వస్తే ప్రధానికి పట్టే సమయం 15 నిమిషాలు. కానీ ఆయన అక్కడికి హెలీకాప్టర్ లో వచ్చారు. సాధారణంగా అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప అంత తక్కు వ దూరానికి ఎవరూ హెలీకాప్టర్ వాడరు. దారిలేని కారడవిలోనో, మందుపాతరలు ఉండే మార్గంలోనో తప్ప ఆ అవసరం రాదు. హైదరాబాద్‌లో అలాంటి అసాధారణ పరిస్థితులు లేవు. టెర్రరిస్టులో సంఘ విద్రోహశక్తులో లేరు. అలా ఉంటే ఇక్కడ అతి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగేదే కాదు. అలాంటి సదస్సుకు అధికారికంగా దర్జాగా రావాల్సిన ప్రధాని బిక్కుబిక్కుమంటూ రావడం బతుకుజీవుడా అన్నట్టు ఆఘమేఘాలమీద వెళ్ళిపోవడం రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగించింది. దానికి తోడు దాదాపు ప్రధాని మళ్ళీ ఢిల్లీలో దిగేదాకా ట్రాఫిక్ నియంవూతణ అలాగే ఉండింది. స్కూళ్ళను, ఆఫీసులను మూసివేశా రు. అంతటితో ఆగకుండా హైటెక్ సిటీకి అందులో ఉన్న కంప్యూటర్ కంపెనీలకు, దేశ విదేశీ వాణిజ్య వ్యాపారసంస్థలకు ఒక్క పూట సెలవు కూడా ప్రకటించి అన్నీ మూసివేసి అప్రకటిత కర్ఫ్యూ విధించారు. సరిగ్గా మూడుగంటలు కూడా లేని ప్రధాని పర్యటనకు అనూహ్యమైన భద్రత కల్పించి ఆరుగంటల పాటు హడావిడి చేశారు. ఏ ఒక్క పత్రికా దీన్ని ప్రశ్నించలేదు. సీమాంధ్ర చానెల్స్ ఈ అవమానాన్ని ప్రశ్నించలేదు. ప్రైవేటు జీవితాల్లో చొరబడి పత్రికా స్వేచ్ఛ, తమ హక్కు అని అని దబాయించే వారికి వడపోత ఒక అవమానమని పత్రికల వ్యాపారులుగా, యజమానులుగా అది తమ హక్కు ల హననమని అనిపించలేదు. అలాంటిదేమీ జరగకుండానే జరిగినట్టు అన్ని పత్రికల్లో ప్రధాని గారి రాకతో హైదరాబాద్ నగరం పునీతమైనట్టు పతాక శీర్షికలలో మన్‌మోహనుడి ప్రసంగాన్ని ప్రచురించి ముగ్ధులైపోయారు.

సరిగ్గా ఎనిమిదో చాప్టర్‌లో సూచించినట్టుగానే తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కరుకుదనాన్ని ప్రదర్శిస్తోంది. ప్రధాని పర్యటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారు. ఆయనను ప్రధాని పల్లకీలో కూర్చోబెట్టి మోస్తోన్న ఈ రాష్ట్ర పార్లమెంటు సభ్యులకు కనీస మర్యాద కోసమైనా ఆయన పర్యటన గురించి చెప్పలేదు. వారికి ఆహ్వానాలు పంపాలన్నా నియమాన్ని కూడా పాటించలేదు. ఇది అవమా నకరం. అది ఎంపీలకే కాదు. స్వయంగా ప్రధానికే అవమానం. పార్లమెంటు సాంప్రదాయాల ప్రకా రం ఎంపీలకుండే అరుదైన గౌరవాల్లో ఎక్కడికైనా, ఎటువంటి సందర్భంలోనైనా వెళ్ళే అధికారం కలిగి ఉండడం ఒకటి. అలా వెళ్తే వారి ప్రాణాలకు ముప్పు ఉంటే తప్ప అడ్డుచేప్పే అధికారం ఎవరికీ లేదు. కానీ ప్రధానిని కలిస్తే అలంటి ప్రమాదం ఏమీ లేదు. అలాంటప్పుడు ప్రధాని రాక గురించి ఎందుకని పార్లమెంటు సభ్యులకు చెప్పలేకపోయారు? ఎందుకని కనీస ఆహ్వానం కూడా పంపలేకపోయారు? ఇవి ఆ ఎంపీలు తేల్చుకోవాల్సి న విషయాలు. పార్లమెంటు సభ్యలను ఈ మధ్య ముఖ్యమంత్రి నివాసం ముందు కాపలా ఉండే చౌకీదార్ల మెడలు పట్టి నెట్టేసిన సంఘటనలు చూశాం. ఇక ప్రధానిని కలిసే పరిస్థితి వీళ్ళకు ఉందా అన్నది కూడా అనుమానమే. బహుశా అంత సీన్ లేదని భావించడం వల్లే ప్రధాని పర్యటనలో పాటించాల్సిన పద్ధతులు ప్రోటోకాల్ పాటించకపోయి ఉండవచ్చు. కానీ ఇది ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘనే! కేవలం ఆ ఎంపీలనే కాదు వాళ్ళను ఎన్నుకున్న ప్రజలను కూడా అవమానించినట్టే భావించాల్సి ఉంటుంది.

ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపడం, అనుమతులున్న ఉద్యమాలను అణచివేయడం కేసుల్లో విద్యార్థులను బంధించి భయపెట్టడం ఇవన్నీ ఎనిమిదో చాప్టర్‌లో భాగంగా జరుగుతున్నవే. ప్రధాని పర్యటనకు ముందే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్కను అక్రమంగా నిర్బంధించి జైలుకు తరలించడం, ఆమెపై అనేక కేసులు పెట్టి వేధించడం కూడా ఒక పథ కం ప్రకారం జరుగుతున్నవే. చట్టవ్యతిరేక చర్యలు ప్రభుత్వమే ఒకవైపు రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజలను సంఘ వ్యతిరేకులుగా, విద్రోహక శక్తులుగా ముద్రవేయాలని చూస్తోంది. కానీ విద్రోహులేవరో ఇప్పటికే తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఇప్పుడు జర్నలిస్టుల పట్ల వివక్ష మూలం గా అది ప్రపంచమంతటికీ తేటతెల్లమయ్యింది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమకారుపూవరూ ప్రధానికి అడ్డు తగులుతామని, ఇక్కడ అడుగు పెట్టనీయమ ని చెప్పలేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తామని అదీ చట్టం అనుమతించే పద్ధతుల్లోనే చెపుతామని ప్రకటించారు. ఆ మేరకు నల్ల బెలూ న్లు గాలిలో వదులుతామని చెప్పారు. కానీ ప్రభుత్వం, పోలీసులే ప్రధానిని భయకంపితుడిని చేశారు. గాలిలో ఎగిరే నల్ల బెలూన్‌లలో బుల్లెట్లను చూపించారు. జై తెలంగాణ నినాదాలు మందుపాతరలై మారుమోగుతాయని బెదిరించారు. పాపం దర్జాగా వచ్చి భారత ప్రధానిని దొడ్డిదారిలో రప్పించారు. అదే దారిలో పంపించారు. ఇంతకీ కిరణ్ కుమార్‌రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నారో గానీ తెలంగాణవాదం హైదరాబాద్‌లో అడుగుపెట్టలేనంతగా బలపడిందని మాత్రం ప్రధానికి అర్థమై ఉంటుంది. అది చాలు. తెలంగాణలోని సబ్బండ వర్ణాల ఆకాంక్ష కోసం సంఘటితమైన తెలంగాణ జర్నలిస్టు ఫోరం పత్రికా స్వేచ్ఛ కోసం వీరోచితంగా పోరాడుతున్నది. ఆ పోరాటంలో తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల ఆకాంక్ష ఇమిడి ఉన్నది. దీనికి తెలంగాణ జాతి మొత్తం సంఘీభావం ప్రకటించాలి.

శుక్రవారం, అక్టోబర్ 05, 2012

ఈజిప్ట్‌ను తలదన్నిన మార్చ్














"మేం ముందుగా చెప్పినట్టే మా మాటమీద నిలబడి ఉంటాం. మేం గడిచిన అరవై ఏళ్ళుగా మా తల్లి తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన విద్యార్థులం. యిప్పుడు మళ్ళీ ఈ చారివూతక రుతువులో మరోసారి తెలంగాణ తల్లి స్వేచ్ఛ కోసం ప్రాణాలనైనా అర్పించి పోరాడడానికి ముందుకు కదులుతున్నాం. కనీసం మా మీద కురిసిన ఆ రబ్బరు బుల్లెట్ల ను, బాష్పవాయు గోళాల శకలాలను చూసైనా మా ప్రియతమ నాయకుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఆయన మా మాతృభూమి మీద నిలబడి ఆ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటిస్తాడు". 


జస్వంత్ జెస్సి సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ కోసం తన ఫేస్‌బుక్‌లో ఆంగ్లంలో రాసుకున్న భావోద్వేగ ప్రకటనకు తెలుగుభావం ఇది. ఆయన ఆరోజు చేసిన అనేక పోస్టులలో ఇదొకటి. అది చదువుతున్నంతసేపూ నిండా వర్షంలో తడిసి సమత తదితర మిత్రులతో కలిసి ఆయన నాకు నెక్లెస్‌రోడ్‌లో కలియ తిరుగుతున్న దృశ్యమే కళ్ళల్లో మెదిలింది. జెస్సి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సివిల్ సర్వీసెస్ రాసి కలెక్టర్ కావాలని కలలుకంటున్నాడు. అయితే అదేమంత పెద్ద కల కాదతనికి! అంతకుమించిన కల తెలంగాణ.ఆ తెలంగాణ కోసం ఆయన కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నా డు. ఎక్కడ ఉద్యమ అలికిడి విన్నా ఆ యువకుడు ఉలిక్కిపడి లేస్తాడు. ముందు వరుసలో ఉరుకుతాడు. అలాగే సాగరహారానికి కూడా పరిగెత్తి వచ్చాడు. అలా ఒక్క జస్వంత్ మాత్రమే కాదు లక్షలాది మంది సెప్టెంబర్ 30న నెక్లెస్‌రోడ్ కొచ్చారు. చాలామంది జస్వంత్‌లాగే తమ కలలను రాసుకున్నారు.పాడుకున్నారుపతిన బూనారు.


అచంచలవిశ్వాసంతో,అసమాన సాహసం చేసి వచ్చారు. గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుని వెళ్ళారు. తెలంగాణ మార్చ్ ఏం సాధించిందని కొంటె ప్రశ్నలు వేస్తున్న తుంటరి మీడియాకు తెలంగాణ అంతటా తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసమే సమాధానం. ఏదో ఒకరోజు నిర్ణయం ప్రకటించే రోజు రానే వస్తుందన్న విశ్వాసం ఆ ఆకాంక్షను నిరంతరం వెలిగిస్తూనే ఉంటుంది. ఈజిప్ట్ తరహా ఉద్యమం అని ముందుగా ఎవరన్నారో గానీ ఇది ఈజిప్టును మించిన ఉద్యమం. ఈజి ప్టు కంటే ఎక్కువ ప్రతికూల పరిస్థితుల్లో సాగుతున్న ఉద్యమం ఇది. ఈజిప్ట్ మొత్తం కథ రెండువారాల్లో ముగిసింది. 2011 జనవరి 25న కొద్దివేలమంది యువకుల ప్రజాస్వామ్య ప్రదర్శనతో మొదలయిన ఉద్యమం ఫిబ్రవరి 11న ఆ దేశ అధినేత హోస్ని ముబారక్ రాజీనామాతో ముగిసింది. 



కానీ తెలంగాణ కథ అది కాదు. ఇది అరవయ్యేళ్ళ వ్యథ. ఇప్పటికే వందలాదిమందిని పాలక వర్గాలు బలిగొన్నాయి. కనీసం మూడేళ్లుగా యావత్ తెలంగాణ సమాజం అన్ని పనులూ వదిలేసి తెలంగాణ ప్రకటన కోసం చూస్తున్నది. జస్వంత్ లాగే ఎప్పుడో ఒకరోజు ఆ ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్నది. ఇప్పటికే ఒకసారి వెలువడ్డ ఆ ప్రకటన తరువాయి భాగం కోసమే ఇంకా తండ్లాడుతున్నారు. సాగర హారం చరివూతలో అపూర్వం. వేలాదిమంది పోలీసులను, చెక్ పోస్టులను దాటి మరఫిరంగులను ఎదిరించి, ఇనుప కంచెలు ఛేదించుకుని లక్షలాదిమంది పిల్లాపాపలతో తరలిరావడం అసాధారణం. భారత దేశంలో ప్రజాస్వామ్యం ఉందని అంటారు. కానీ ఈజిప్ట్ నియంత హోస్ని ముబారక్ కనబరచిన ప్రజాస్వామిక ధోరణిని కూడా ఇక్కడి పాలకులు కనబరచలేదు. ముబారక్‌కు వ్యతిరేకంగా వేలాదిమంది గుమికూడిన రోజు నుంచి మూడురోజుల దాకా అక్కడ లాఠీచార్జ్ జరగలేదు. బాష్పవాయువు గోళాలు ప్రయోగించలేదు, సరికదా ముబారక్ స్వయంగా ప్రదర్శకుల డిమాండ్లను ఒక్కొక్కటి అమలుచేస్తూ, తలవంచుతూ వచ్చాడు. 

ఈజిప్ట్‌లో చట్టం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ అన్నీ ఆ నియంత చేతిలోనే ఉన్నా ఆయన వాటిని ఆచి తూచి వాడుకున్నాడు. కానీ ఇక్కడ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సజీవంగా ఉంది. ఆ పార్లమెంటు సభ్యు లు కూడా ప్రజలతో సమాంతరంగా ఉద్యమంలో ఉన్నారు. వారిలో కొందరు ప్రజాస్వామిక విలువల మీద గౌరవంతో ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. ఇంకొందరు ఆ ప్రజల తరఫున ముఖ్యమంవూతిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఒక నియంత కనబరిచిన స్ఫూర్తిని కూడా ఇక్కడి పాలకులు కనబరచలేదు. అన్ని హక్కులనూ కాలరాచి పాలకులు నియంతలనే తలదన్నే విధంగా వ్యవహరించారు. 



‘తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ’ హైదరాబాద్‌లో మార్చ్ నిర్వహిస్తామని మూడు నెలల ముందే ప్రకటించింది. మూడేళ్ళ కింద చేసిన ప్రకటనకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం సూచించిన ప్రకారం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టాలన్నది జేఏసీ ప్రభుత్వం ముందుంచిన ఒకే ఒక్క డిమాండ్. ఈ డిమాండ్ పూర్తిగా ప్రజాస్వామ్యయుతమైనది. కేంద్రం లో అధికారంలో ఉన్న కూటమి ఆమోదించిన నిర్ణయాన్ని అమలు చేయాల ని మాత్రమే ఇక్కడి ప్రజలు కోరారు. పూర్తిగా ఈ పాలకుల మీద, రాజ్యాంగ వ్యవస్థమీద విశ్వాసం ప్రకటిస్తూనే పాలకులు రాజ్యాంగాన్ని అనుసరించి ప్రవర్తించాలనే కోరారు. అలా మూకుమ్మడిగా తమ ఆకాంక్షను వ్యక్తపరచడానికి ఒక వేదిక కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది ప్రజల కనీస హక్కుల్లో ఒకటి. ఈ విషయాన్ని జేఏసీ అన్ని రకాలుగా వివరించింది. చివరికి రాజ్యాంగం గురించి తెలిసిన పెద్దలు, మాజీ న్యాయమూర్తులు, మేధావులు రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి దృష్టికి కూడా ఈ విషయం తీసుకువచ్చారు. అనేక పద్ధతుల్లో తెలంగాణవాదులు చేసిన ప్రయత్నాలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం సాగరహారానికి అనుమతి ఇచ్చింది.

 హుస్సేన్‌సాగర్ తీరంలో మార్చ్ చేసుకోవచ్చని ఒకవైపు అనుమతినిస్తూనే ఆ ప్రాంతాన్ని ముళ్ళ కంచెలలో బంధించింది. మార్చ్‌కు వస్తున్న లక్షలాదిమందిని నిర్బంధించింది. ఒక రాజకీయ ప్రక్రియ కోసం సాగుతున్న మార్చ్‌ను పూర్తిగా పోలీసులకు, పారా మిలిటరీ బలగాలకు అప్పగించింది. మార్చ్ జరుగుతున్నంత సేపు సైన్యం నెక్లెస్‌రోడ్ చుట్టూ కవాతు నిర్వహించింది. రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు, జలఫిరంగులను విచ్చలవిడిగా ప్రయోగించింది. అక్కడొక యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. అయినా ఒక్క అడుగైనా వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రజలు కవాతు చేశారు. ప్రపంచానికి తమ ఆకాంక్ష ఏమిటో మరోసారి వినిపించారు. 



ఇన్ని అవరోధాలకు ఎదురునిలిచి నిలబడినందుకు, ఎంత రెచ్చగొట్టినా విధ్వంసానికి దిగకుండా ఉన్నందుకు ప్రపంచమంతా తెలంగాణ ప్రజలను అభినందించాలి. కానీ అలా జరగలేదు. ఈజిప్ట్ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన మీడియాకు తెలంగాణ మార్చ్ చిన్నదిగా కనిపించింది. ఈజిప్ట్ నియంతలు ప్రజాస్వామ్య ఆకాంక్షకు తలవంచారని రకరకాల కథలల్లి చెప్పి కాలక్షేపం చేసిన భారతీయ మీడియాకు హైదరాబాద్ నది ఒడ్డున పాలకుల నియంతృ త్వ ధోరణి కనిపించలేదు. ఒక్క పత్రికైనా ఎడిటోరియల్ రాస్తుందేమోనని, ఒక్క చానెల్ అయినా తెలంగాణ ప్రజలను అభినందిస్తూ చర్చ పెడుతుందేమోనని చూశాను. కనీసం వ్యక్తమైన ఆకాంక్షను గుర్తిస్తుందేమోనని ఆశించాను. కానీ మీడియా మార్చ్ మొదలు కాకముందే వక్రీకరణలు మొదలుపెట్టింది. మార్చ్ ముగియకముందే ఏం సాధించారని ఎగతాళి కథనాలు రూపొందించింది. ఇట్లా మొత్తంగా ప్రభుత్వం, పోలీసులు, మీడియా మూకుమ్మడిగా దాడిచేసినా కలత చెందకుండా కదిలిపోకుండా నిలబడి ఉండడం ఒక్క తెలంగాణ ప్రజలకే సాధ్యం. అందుకు వారిని, వారినలా తయారుచేసిన జేఏసీని అభినందించాలి. 


సాగరహారం ఏం సాధించిందనే ప్రశ్నకు ఇప్పుడు అర్థం లేదు. అలాంటి ప్రశ్నలు వేసేవారు అక్కడ భారీ హింస జరగాలని, బాష్పవాయు గోళాలు మండి హైదరాబాద్ అగ్నిగుండం కావాలని, ఆ దృశ్యాలను పదేపదే చూపి మళ్ళీ మంటలు రాజేసి తమ చానెళ్ళ రేటింగులు పెంచుకోవాలని, దానితో పాటు ఆ హింసను ఆసరా చేసుకుని తెలంగాణవాదాన్ని పూర్తిగా అణచివేసి ఈ రాష్ట్రం విడిపోకుండా చూసుకోవాలనే ఎజెండా కూడా ఉండి ఉండవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు మార్చ్ ఒక మహదానందాన్ని కలిగించింది. మార్చ్ లో పాల్గొన్న వాళ్ళు తమ జన్మ ధన్యమయిందని భావించారు. దైవదర్శనం చేసుకుని వెళ్ళినంత తృప్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రకంగా మార్చ్ తెలంగాణ ప్రజలకొక ఆత్మవిశ్వాసం కలిగించింది. మార్చ్ సాధించిన రెండో విజయం ప్రజలకు ఒక కొత్త విశ్వాసం అందించడం. పరకాల ఎన్నికల తరువాత తెలంగాణవాదం కనుమరుగైపోయిందని, ఫాంహౌజులకు, ఢిల్లీ సిగ్నల్స్‌కే పరిమితమైపోయిందని అనుకుంటున్న వాళ్లకు మనం కూడా బలమైన సంకేతాలే పంపగలిగామన్న తృప్తిని మిగిల్చింది. నిజంగానే ఆ సంకేతాలు ఎంత బలంగా ఉన్నాయంటే మార్చ్ ప్రశాంతంగా ముగిసినందుకు తాను ఊపిరి పీల్చుకున్నానని స్వయంగా కేంద్ర హోంశాఖా మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు.


ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేయాలన్న మార్చ్ లక్ష్యం నెరవేరింది. ఇంతకాలం మనం ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ మాత్రమే టెలివిజన్‌లలో చూసే వాళ్ళం. కానీ మార్చ్ జరుగుతున్నంతసేపూ కేంద్రంలో అధికారంలో ఉన్న అగ్రనేతలంతా తెలుగు చానళ్లలో తెలంగాణ మార్చ్‌ను అంతే భావోద్వేగంతో తిలకించారట. బహుశా ఆ భావోద్వేగంతోనే సుశీల్‌కుమార్ షిండే అటువంటి ప్రకటన చేసి ఉంటాడు. మార్చ్ తెలంగాణ పౌర సమాజ పటిష్టతకు అద్దం పట్టింది. రాజకీయపక్షాలకు దీటు గా ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, అధ్యాపకులు, పాత్రికేయులు ఈ మార్చ్‌లో సైనికుల్లా కదిలారు. ఒకవైపు డాక్టర్లు జై తెలంగాణ అని నినదిస్తూనే మరోవైపు క్షతగావూతులకు ప్రాథమిక చికిత్స చేస్తూ అంబుపూన్సుల్లో ఆస్పవూతులకు తరలించే దృశ్యం. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తూనే... జర్నలిస్టులే స్వయంగా పారామిలటరీ దళాలను తరిమికొట్టడం. తాము అరెస్ట్ అయి పోలీసుల చెర లో బందీలుగా ఉండీ న్యాయవాదులు ఉద్యమకారులను విడిపించే ప్రయత్నాలు చేయడం.. ఇట్లా అనేక అరుదైన సంఘటనల సమాహారంగా సాగరహారం ముగిసింది. మార్చ్ సాధించిన మరో విజయం ప్రభుత్వ నిజ స్వరూ పాన్ని ప్రజలకు అర్థం చేయించడం. చివరి నిమిషం దాకా ఉద్రిక్తతలు పెంచి, మార్చ్‌కు అనుమతి నిచ్చినట్టు ప్రకటించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రజలందరూ గమనించారు. మార్చ్‌ను తాము అడ్డుకోబోమని చెపుతూనే ఉస్మానియా యూనివర్సిటీని దిగ్బంధించడం, స్వయంగా ముఖ్యమం త్రి స్వీయ గృహ నిర్బంధంలో ఉండిపోయి చివరకు సొంతపార్టీ పార్లమెంటు సభ్యులను కూడా కలుసుకోవడానికి నిరాకరించడం, గవర్నర్ నివసించే రాజ్‌భవన్ చుట్టూ ముళ్లకంచెలు నాటడం, శాసనసభకు, సచివాలయానికీ తాళాలు వేసి పోలీసు పహారాలో కాపాడుకోవడం ఇవన్నీ ప్రజలు ప్రత్యక్షంగా గమనించారుపభుత్వ హడావుడికి భిన్నంగా ప్రజలు ప్రశాంతంగా నడవడాన్ని గమనించిన నగరవాసులు చాలామంది ఆ రోజు స్వయంగా వచ్చి చేరుకున్నారు. ఇది తెలంగాణ ఉద్యమానికి ఉన్న బలానికొక నిదర్శనం.



కానీ ఆ బలాన్ని నిలబెట్టుకోవడానికి జేఏసీ ఇప్పుడు ఏం చేయబోతుంద న్న ప్రశ్న చాలా కీలకం. మార్చ్ అనంతరం ఇప్పుడు తెలంగాణ ప్రజలే కాదు సీమాంధ్ర నాయకులు, ఆ ప్రాంత మీడియా కూడా ఈ విషయంపట్ల ఆసక్తి ని చూపిస్తోంది. నిజానికి సాగరహారం జేఏసీ నిర్వహించిందే అయినప్పటికీ జేఏసీలో ఉన్న భాగస్వామ్య పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు కీలక భూమిక పోషించాయన్నది తిరుగులేని వాస్తవం. జేఏసీ స్వయంగా స్వతంవూతంగా కేడర్, సంస్థాగత నిర్మాణం ఉన్న వ్యవస్థ కాదు. జేఏసీ తెలంగాణ సకల జనులకు ఒక గొడుగు లాంటిది. అందులో భాగస్వామ్యంగా ఉండి కదులుతున్న పార్టీలు, పక్షాలు దానికొక రూపాన్నిచ్చి నిలబెట్టాయన్నది వాస్తవం. ఆ పక్షాలన్నిటి కృషి వల్లే సాగరహారం మానవహారమై నిలబడింది. వారితో పాటు జేఏసీలో భాగంగాలేని సంస్థలు, వ్యక్తులు కూడా అందులో భాగ మై కదిలారు. ఒక రకంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మినహా అన్ని రాజకీయపార్టీలు అక్కడి కి వచ్చాయి. గద్దర్, విమలక్క వంటి ఉద్యమకారులు కూడా తమ తమ కార్యకర్తలతో కళా బృందాలతో అక్కడికి వచ్చారు. ఇదొక మంచి పరిణామం. జేఏసీకి ఇదొక కొత్త బలాన్ని ఇచ్చే విషయం కూడా. కానీ ఇటువంటి ఉమ్మడి వేదిక మీది నుంచి రాజకీయ ప్రసంగాలు చేయ డం ఇతర రాజకీయ పక్షాలను కొందరు విమర్శించడం కొత్త వివాదాలకు కారణం అయింది. 


ముఖ్యంగా విమలక్క చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక్క టీఆర్‌ఎస్‌నే కాదు జేఏసీని కూడా ఇరకాటంలో పెట్టాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీలో చేస్తోన్న లాబీతో తెలంగాణ రాదని ఇక్కడ రాళ్ళు పట్టుకోవాలన్న ధోరణిలో ఆమె కొంచెం కటువైన పదాలతో ఆవేశ పూరిత ప్రసంగం చేశారు. అది అప్రస్తుత ప్రస్తావన. నిజంగానే టీఆర్‌ఎస్ పూర్తిగా ఢిల్లీకే పరిమితమై ఉంటే ఆ విమర్శ బాగుండేదేమో కానీ టీఆర్‌ఎస్ అక్కడ ఇక్కడా రెండుచోట్లా విమలక్క పార్టీ కంటే బలంగానే కనిపిస్తోంది. నిజానికి ఆవేశంతో ఆమె ఆ మాటలు అన్నప్పుడు ఎదురుగా ఉన్న సాగరహారంలో గులాబీ జెండాలే బలంగా ఎగిసిపడుతున్నాయి. పైగా ఆ జేఏసీ అందులో విమలక్క పార్టీ భాగం కాదు. టీఆర్‌ఎస్ ఆ వేదిక నిర్మాణం లో, ఇంతకాలం మనగలగడంలో కీలక పాత్ర పోషించింది. ఒక రాజకీయపార్టీగా విమలక్క పార్టీ తన వేదిక ద్వారా ఏదైనా మాట్లాడవచ్చు. ఎంతయినా విమర్శించవచ్చు. కానీ టీఆర్‌ఎస్ కీలక భాగస్వామి అయిన జేఏసీ వేదిక నుంచి అలా మాట్లాడడం జేఏసీ ధర్మ సూత్రాలకు విరుద్ధం. ఆది పెద్ద దుమారమై చివరకు టీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడి నుంచి వైదొలిగేలా చేసింది. అలా జరిగి ఉండకపోతే కోదండరాం ఆశించినట్టు మార్చ్ కొనసాగేదేమో. అది రాజకీయ ఒత్తిడిని పెంచేదేమో. కానీ చివరకు అదేదీ జరగకుండానే మార్చ్ ముగిసింది. 


ఈ అనుభవం కోదండరాం నాయకత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇప్పటిదాకా అనేక అవమానాలను పంటి బిగువున అణచిపెట్టుకుంటూ పరస్పర విరుద్ధభావాలు, సిద్ధాంతాలున్న సంస్థలను సమన్వయపరుస్తున్న వ్యక్తి ఆయ న. ఆయనను ఇబ్బందిపెట్టే రీతిలో ఆ సంస్థలో భాగస్వాములే కాదు తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరూ ప్రవర్తించకూడదు. ఉద్యమం టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు ఎంత అవసరమో టీఆర్‌ఎస్, కేసీఆర్ కూడా ఉద్యమానికి అంతే అవసరం. 

ఇప్పుడు తెలంగాణ కీలక దశలో ఉంది. ఢిల్లీ సిగ్నల్స్‌ను బట్టి ఈ మాట చెప్పడం లేదు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుతున్న సిగ్నల్స్ కూడా ఇప్పుడు బలంగానే ఉన్నాయి. తెలంగాణ ఎంపీలు ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌ను బద్దలు కొడుతున్నారు. కచ్చితంగా ఇది కాంగ్రెస్‌ను కలవరపెట్టే విషయం. ఇప్పుడు జేఏసీ కాంగ్రెస్ ఎంపీలకు కూడా అండగా ఉండాలి. మంత్రుల మీద ఒత్తిడి పెడతామని జేఏసీ చేసిన ప్రకటన చాలా కీలకం. ఆ పని చేస్తే తప్ప కాంగ్రెస్ మత్తు వదలదు. అయితే దానికొక స్పష్టమైన కార్యాచరణ జేఏసీ ప్రకటించాలి. ఢిల్లీలో ఏం జరిగిందో జేఏసీ కేసీఆర్‌ను కలిసి తెలుసుకోవాలి.



ప్రజలకు ఆ సంగతులన్నీ తెలియజెప్పాలి. మళ్ళీ ఢిల్లీ చర్చలకు పిలిచేదాకా ఆగకుండా అదే ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉద్యమం కొనసాగాలి. ఈ నెలే చివరి గడువు అని కేసీఆర్ అంటున్నారు. ఈ నెలలో తేలితే సరే సరి, లేకపోతే జేఏసీ ఈ ఏడాది చివరి గడువుగా ప్రకటించాలి. మళ్ళీ డిసెంబర్ 9 నాటికి తెలంగాణ ప్రకటన రాకపోతే డిసెంబర్ 9న స్వయంగా ప్రజలే హైదరాబాద్‌కు వచ్చి శాసనసభకు, సచివాలయానికి వేసివున్న తాళాలు తెరుచుకుని స్వయంపాలన ప్రకటించుకునే దిశగా ఆలోచించాలి. ఈజిప్ట్ తరహా కాదు. దాన్ని తలదన్నే స్ఫూర్తి పొందిన ఈ తరుణంలో ఇంకొకసారి డిసెంబర్ 9 ‘ఆక్యుపై హైదరాబాద్’ అంటే ఢిల్లీ దానంతట అదే దిగివస్తుంది. జస్వం త్ పేర్కొన్నట్టు అప్పుడే మన నేలమీద నిలబడి మనం ఒక స్పష్టమైన ప్రకటన వినే రోజు వస్తుంది!!